Tuesday, 3 November 2026

27 నుంచి నగరంలో ప్రాపర్టీ షో

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): నగరంలో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో జరుగనుంది. వివిధ వెంచర్లకు సంబంధించిన వివరాలు, రుణసౌకర్యాల వివరాలను ఇందులో ప్రదర్శిస్తారు. ట్రెడా ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏడు ప్రాపర్టీ షోలను నిర్వహించింది. 8వ విడతగా నగరలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు నిర్మాణంలో ఉన్న, నిర్మించిన రెసిడెన్షియల్‌ తదితర ప్రాపర్టీలను ప్రదర్శించనున్నాయి. ఈ ప్రదర్శనలో బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, మెటీరియల్‌ సప్లయర్లు కూడా పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకందారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని ట్రెడా ప్రతినిధులు తెలిపారు. జిఎస్టీ అమలు కారణంగా రానున్న కొన్ని నెలల్లోనే స్థిరాస్తుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రెడా ప్రతినిధులు అంటున్నారు. ఇలాంటి సంస్కరణల వల్ల పారదర్శకత పెరిగే అవకాశం ఉన్న మాట వాస్తవమేనని, అయితే అన్ని రకాల నిబంధనల అమలు కారణంగా స్థిరాస్తుల ధరల పెరుగుదలకు ఆస్కారం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా అనుసరిస్తున్న విధానాలతో దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, ఫలితంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందని అన్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. అదే సందర్భంలో జిఎస్టి అమలు కారణంగా రియల్టీ ధరలు పెరగడానికి అవకాశం ఉందని, రెసిడెన్షియల్‌ విభాగంలో ధరలు పెరిగే ఆస్కారం ఉందన్నారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇతర రాష్టాల్ల్రోని రియల్‌ ఎస్టేట్‌తో పోల్చితే నిలకడగా ఉందని, ఇక్కడున్న ధరలు ఇతర నగరాలతో పోల్చితే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. రానున్న రెండు మూడేళ్ల కాలంలో హైదరాబాద్‌ మార్కెట్‌ మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని చెప్పారు. కంపెనీల రాకతో వాణిజ్య ప్రదేశానికి డిమాండ్‌ పెరుగుతోందని, ఇది గృహాల గిరాకీ పెరుగుదలకు దారితీస్తుందన్నారు.