7న కృత్రిమ అవయవాల పంపిణీ
నిజామాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎం. కిరణ్ మహి తెలిపారు. 7న నగరంలోని బస్వాగార్డెన్(వినాయక్‌నగర్)లో పంపిణీ ఉంటుందన్నారు. వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృతిమ అవయవాల పంపిణీ, చెవిటి వారికి వినికిడి మిషన్లు, వృద్ధులకు చేతికర్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జడ్జి తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, మున్సిపల్ కార్పొరేషన్, ఐసీడీఎస్, మెప్మా, ఎన్‌జీవోస్, రెవెన్యూ సిబ్బంది సహకారంతో చేస్తామన్నారు. దీనికిగాను ఎవరికి ఏం అవసరం ఉందో దాని గుర్తించి దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అలాగే సీనియర్ సిటిజన్లకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు న్యాయ చట్టాలు ఏం చెబుతున్నాయి అనే వివరాలపై అవగాహన జరుగుతుందన్నారు. కృతిమ అవయవాల పంపిణీ, అవగాహన సదస్సును ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి తెలిపారు.