చండూరులో కత్తిపోట్ల కలకలం..
ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, ఒకరికి తీవ్ర గాయాలు..!
చండూరు మే 24 (జనంసాక్షి)నల్గొండ జిల్లా చండూరు పురపాలక సంఘం పరిధిలో ఆదివారం ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణ కేంద్రంలో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. చండూరు పట్టణంలో ఇద్దరు యువకుల మధ్య ఏదో విషయమై తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలో వివాదం ముదరడంతో “నాగిళ్ళ నరేష్” అనే యువకుడు ఆగ్రహంతో ఊగిపోతూ.. దోటి శివ” అనే మరో యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో శివ శరీరంపై కత్తితో తీవ్రమైన గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే చండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవకు కారణమైన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తీవ్రంగా గాయపడిన బాధితుడు శివను పోలీసులు తక్షణ చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.



