కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!

 

 

 

 

ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు
అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం!
బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు మెదపరేం?

మాడుగులపల్లి, మే 05 (జనం సాక్షి):ప్రభుత్వ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి అధికారుల పర్యవేక్షణ అటకెక్కింది. మాడుగులపల్లి మండలం ఇందుగులలో జరుగుతున్న ఆర్‌ అండ్ బీ (R&B) రోడ్డు నిర్మాణం అవినీతికి నిలువుటద్దంగా మారింది కాంట్రాక్టర్‌ లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ పనుల్లో నాణ్యత అన్న పదమే కనిపించడం లేదు పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, సాక్ష్యాలతో సహా అక్రమాలనుబయటపెడుతున్నా సంబంధిత అధికారులు కుంభకర్ణ నిద్ర వీడకపోవడం వెనుక భారీగా మామూళ్ల మత్తు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఈ రోడ్డు పనుల్లో వనపర్తి జిల్లాకు చెందిన చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు హడావిడి చేశారు క్షేత్రస్థాయికి వచ్చి బాలకార్మికులను పంపించి వేసి, తాము చాలా సిన్సియర్ అని ఫోటోలకు ఫోజులిచ్చారు అయితే, అసలు సమస్య రోడ్డు నాణ్యత దగ్గరకు వచ్చేసరికి అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం బాలకార్మికుల ఇష్యూను సాకుగా చూపి,రోడ్డు నిర్మాణంలోజరుగుతున్న వేల కోట్ల విలువైన నాణ్యత లోపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు
సిమెంట్‌ రోడ్డు (సీసీ రోడ్ ) నిర్మాణంలో ఇసుక వాడకం అత్యంత కీలకం కానీ ఇందుగులలో కాంట్రాక్టరుకు ఇసుక ఖరీదు భారంగా అనిపించిందేమో కానీ, నిబంధనలను తుంగలో తొక్కారు ఇసుకకు బదులుగా పూర్తిగా కంకర పొడిని (డస్ట్) వాడుతూ పనులు కానిచ్చేస్తున్నారు డస్ట్‌తో వేసే రోడ్లు కేవలం కొన్ని నెలలకే బీటలు వారి, వర్షాకాలంలో కుంగిపోతాయని తెలిసినా ఇంజనీరింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు కాంట్రాక్టర్‌ ఇచ్చే భారీ కమిషన్లకు ఆశపడి, అధికారులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా? అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి
పనులు జరుగుతున్న చోట కనీసం ఒక్క అధికారి కూడా ఉండటం లేదు నాణ్యత గురించి గ్రామస్తులు నిలదీస్తే కాంట్రాక్టర్ తన అంగబలంతో దౌర్జన్యానికి దిగుతున్నారు మేం ఎవరికైనా ఇచ్చుకుంటాం మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అన్న చందంగా కాంట్రాక్టర్ తీరు ఉంటే, అధికారులు అతనికి వంత పాడటం సిగ్గుచేటు కింది స్థాయి అధికారుల తీరుపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ఇప్పుడు జిల్లా కలెక్టర్ వైపు చూస్తున్నారు తక్షణమే క్వాలిటీ కంట్రోల్ అధికారులతో రోడ్డు నమూనాలను సేకరించి పరీక్షించాలి నాణ్యత లేని డస్ట్ వాడకాన్ని నిలిపివేసి, నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడాలి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారులు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోకపోతే గ్రామస్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రజాధనాన్ని దుమ్ముపాలు చేస్తున్న ఈ వ్యవస్థపై పెద్ద ఎత్తున పోరాటానికి ఇందుగుల ప్రజలు సిద్ధమవుతున్నారు వార్తలు వచ్చినప్పుడు ఫోటోలకు ఫోజులివ్వడం కాదు రోడ్డు నాణ్యత ఎలా ఉందో చూడటం మీ కనీస ధర్మం ఒక కాంట్రాక్టర్‌కు మీరు బానిసలా? లేక ప్రభుత్వానికి జవాబుదారీలా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజల సొమ్ముతో నాణ్యత లేని రోడ్లు వేసి చేతులు దులుపుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.