తెలంగాణ జర్నలిస్టుల కలాల కవాతు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు కలాల కవాతు చేపట్టారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘ కలాల కవాతు’ ప్రారంభమైంది. సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీగా జర్నలిస్టులు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడారు. ప్రధాని పర్యటనే  నేపథ్యంలో తెలంగాణ మీడియాపై సీమాంధ్ర సర్కార్‌ చూపిన వివక్షకు నిరసనగా కలాల కవాతు చేపట్టామని తెలియజేశారు. స్వేచ్ఛను హరించవద్దని ప్రగల్భాలు పలికే సీమాంధ్ర మీడియా సంస్థలు తమకు ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు. తమ కవాతుకు సంఘీభావం తెలపకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. సర్కార్‌ క్షమాపణ చెప్పేదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రెస్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్ధి సంఘాల నేతలు, పలు పార్టీలు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.