బడ్జెట్ రూపకల్పనలో లోపాలు ఉన్నాయి : కాగ్
హైదరాబాద్ : రాష్ట్ర పరిస్థితులపై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పించింది. బడ్జెట్ రూపకల్పనలో లోపాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చుల మధ్య పొంతన లేదని తెలిపింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘనేనని పేర్కొంది. కేటాయింపుల్లో ఆరోవంతు నిధులు మిగులుతున్నాయని వెల్లడించింది. సామాజిక, ఆర్ధిక అభివృద్ధి పథకాల అమలు విషయంలో అంతర్గత నియంత్రణ పనిచేయడం లేదని తెలిపింది. 2011-12లో మొత్తం నిధులు నిర్దేశ ప్రయోజనాలకు వినియోగించలేదని చెప్పింది. వివిధ శాఖలకు నిధుల కేటాయింపు లక్ష్యం నెరవేరడం లేదని అభ్యతరం తెలిపింది. విద్య, ఆరోగ్య రంగాల నిధుల కేటాయింపు వినియోగాన్ని విస్మరించాలని చెప్పింది. 11 ప్రభుత్వరంగ సంస్ధల్లో పేరుకుపోయిన నష్టాల మొత్తం రూ.5,979 కోట్లని పేర్కొంది. గృహ నిర్మాణ సంస్థ నష్టం రూ. 3,554 కోట్లు, ఆర్టీసీ నష్టం రూ. 1,984 కోట్లని వివరించింది. ద్రవ్యలోటు స్వల్పంగా పెరిగినప్పటికీ ఎఫ్‌ఆర్‌బీఎం నిర్దేశించిన పరిమితి మించలేదని పేర్కొంది. అప్పులకు సంబంధించి వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తాగునీరు, రహదార్ల కోసం 2012 మార్చి 31 నాటికి రూ. 49,516 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.


