అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

-టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణి రాం సింగ్.
పోటో: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సింగరేణి జేఏసీ నాయకులు.
బెల్లంపల్లి,సెప్టెంబర్13,(జనంసాక్షి)
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణి రాం సింగ్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదివ తేదీ నుండి తలపెట్టిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, హై పవర్ కమిటీ వేతనాల తదితర డిమాండ్లపై కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయడం తెలిసిందే. సమ్మెలో భాగంగా నేడు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగినదని, దీనికి సంబంధించి కైరిగూడ మొదలుకొని మణుగూరు, సత్తుపల్లి, ఖమ్మం వరకు రాత్రి రాత్రికే రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను మరియు వీరికి నాయకత్వం వహిస్తున్న సింగరేణి జేఏసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఈఅక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కాంట్రాక్టు కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. హై పవర్ కమిటీ వేతనాలు మరియు జీవో నం 22ను తక్షణమే గెజిట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సింగరేణి జేఏసీ నాయకులు బొల్లు మల్లయ్య, బిసాడి ముకుందరావు, అంబాల మహేందర్, జిల్లాల మోహన్, కొండ్ర శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.