అక్రమ గోడ నిర్మాణాన్ని తొలగించాలని రైతుల ఫిర్యాదు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 04 (జనం సాక్షి) :వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఉరుసు రంగసముద్రం చెరువుకు సంబంధించిన నాలాకు అడ్డంగా కొందరు వ్యక్తులు అక్రమంగా అనుమతి లేకుండా నిర్మాణం చేసిన గోడను తొలగించాలని ఉరుసు రంగసముద్రం చెరువుకు సంబంధించిన రైతులు సోమవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. సుమారు 100 సంవత్సరాల పైగా ఇక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని వీటికి సంబంధించిన నాలా నీళ్లు సునాయాసంగా వెళ్లకుండా గోడ నిర్మాణం చేయడంతో వర్షాకాలం సమయంలో నీళ్లు నిలిచి పంటపొలాలు ములుగుతున్నాయని అదేవిధంగా బట్టుపల్లి రోడ్డుపై నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులకు తెలిపారు. గతంలో కూడా ఇదే సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు రైతులు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో స్వామి మల్లేశం, కుమారస్వామి, రవీందర్ తదితరులు ఉన్నారు.