అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 15
అల్వాల్ సర్కిల్ పరిధిలో గత కొన్ని నెలలుగా చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవనాలను నిర్మిస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మామ్ముళ్ల మత్తులో పట్టించుకోవడంలేదని మేడ్చల్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఈ మురళీకృష్ణ ఆరోపించారు. అల్వాల్ సర్కిల్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అల్వాల్ మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా వ్యాపార వాణిజ్య భవనాలు శ్రద్ధ నిర్మాణాలు చేపడుతున్నారని దీనికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జోరుగా సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ నిర్మాణాల వలన డ్రైనేజీ రోడ్లు రవాణా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని దీనివలన ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికిగండి పెడుతున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు తమ జేబులునింపుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇట్టి అక్రమ నిర్మాణాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తమ కార్యాలయానికి వచ్చి తమ ఇబ్బందులను వివరించారన్నారు. ఈ విషయాలను అధికారుల దృష్టికి మేము గతంలో ఎన్ని సార్లు తీసుకువెళ్లిన నోటీసులు పంపిస్తున్నామని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అప్పటిలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయి గృహప్రవేశాలు అద్దెలకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కళ్ళు తెరిచి ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల మేడ్చల్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మురళీకృష్ణ హెచ్చరించారు.
Attachments area




