అక్రమ మా, సక్రమమా…. ?

దర్జాగా ప్రభుత్వ భూమిలో పాగా

** నాడు పాక, నేడు శాశ్వత కట్టడం

*”” చోద్యం చూస్తున్న అధికారులు

మానకొండూరు, సెప్టెంబరు 14 (జనం సాక్షి)

శాఖల సమన్వయ లోపం అక్రమార్కులకు వరమైంది. ప్రభుత్వ భూమి వారి పరమైంది. వాణిజ్య కార్యకలాపాలకు షెడ్డు నిర్మించగా , వ్యాపార లావాదేవీలకు సిద్ధమైంది. మానకొండూరు లో కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారి వెంట ఇంత దర్జాగా కబ్జా పర్వం కొనసాగుతున్న, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం లోని ఆంతర్యం అంతుచిక్కడం లేదు. లక్షలు విలువచేసే భూమి అన్యాక్రాంతం అవుతున్నా, అక్రమంగా షెడ్డు నిర్మించిన, అడ్డుకోవడం అటుంచి, నిర్మాణ పనులు నిలిపి వేయ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

* అసలేం జరిగింది…… ?

మానకొండూరు లోని కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి వెంట సబ్ స్టేషన్ పక్కన విద్యుత్ శాఖకు సంబంధించిన స్థలం లో గత కొన్ని ఏళ్ళ క్రితం ఓ వ్యక్తి టీ హోటల్ పేరిట పాక వేసుకొని వ్యాపారం నిర్వహించాడు. అధికారుల అండదండ లో, అతన్ని ఆదుకోవాలని అనుకున్నారో తెలియదుగానీ, పాక వేసే సమయంలో అప్పటి రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దాంతో ఆ వ్యక్తి కొన్నిరోజులు టీ కొట్టు నిర్వహించి పాకను షెడ్డు గా మార్చాడు. షెడ్డులో కరెంట్ సౌకర్యం కోసం విద్యుత్ అధికారులను సంప్రదించగా వారు నిరాకరించారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆ వ్యక్తి కొన్నాళ్ల క్రితం టీ కొట్టు మూసి వేశాడు.
ఇదిలాఉండగా మూసిన షెడ్డు పై ఇద్దరు వ్యక్తుల కన్నుపడింది. ప్రభుత్వ భూమి లో నిర్మించిన షెడ్డుకు అ వ్యక్తి దగ్గర లీజు కుదుర్చుకున్నారో, కొనుగోలు చేశారో తెలియదు కానీ, వారు ఆ షెడ్డు ని ఆధీనంలోకి తీసుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తో మరింత ధృఢంగా నిర్మించి వారి పరపతిని ఉపయోగించి, విద్యుత్ సౌకర్యం కోసం పడరాని పాట్లు పడుతూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొని రాగా గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు ఏఈలు నిరాకరించారు. గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు ఏఈ లు బదిలీపై వెళ్లడంతో, తిరిగి వారి ప్రయత్నాలు ప్రారంభించి విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
షెడ్డు పైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటం, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళే దారిలోనే యు టర్న్ స్థలం కావడంతో, అటు బస్టాండ్ ఇంత రద్దీ గా ఉన్న స్థలంలో షెడ్డు వేయటంతో రహదారి ఇరుకుగా మారి, బస్టాండ్, రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తహశీల్దార్, ఆర్ఐ లు, విద్యుత్ అధికారులు అందరూ నిత్యం గమనిస్తున్నా , ” మాకెందుకులే” అనుకోవటంలో అసలు గుట్టు పెరుమాళ్ళ కెరుక. పెద్ద వాహనాలు విద్యుత్ కార్యాలయానికి వచ్చే సమయంలో వెనక్కి వెళ్ళ లేక, బస్టాండ్ రహదారి ఇరుకుగా మారగా నేరుగా రోడ్డుపైనే వాహనాలు నిలిపే పరిస్థితి ఎదురైంది. పలు శాఖల అధికారులు షెడ్డు విషయంలో ఉదాసీనత కనబరచడం ప్రభుత్వ స్థలాలను కాపాడటంలోని వైఫల్యం వెనుక అసలు మతలబు ఏమిటో ఆ పై వాడికే తెలియాలి.

**. నిబంధనలున్నా అమలు సున్న

హైటెన్షన్ వైర్లు కింద ఎలాంటి కట్టడం ఉండకూడదన్న నియమo తోపాటు, సబ్ స్టేషన్ దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టారా ద ని, రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే మూలమలుపులో ప్రమాదాలు సంభవించే పరిస్థితి గోచరించడం, అసలు ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు శాశ్వత కట్టడం నిర్మించరాదు అనే నియమాలు ఉన్నా అమలు సున్నాగా మారింది. తక్షణం అక్రమ కట్టడం కూల్చివేసి, రెవెన్యూ కార్యాలయానికి, బస్టాండ్ లోని కి, విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి వచ్చే వాహనాల పార్కింగ్ కు వీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులపై కబ్జాదారుల పై తగు చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని రక్షించాలని ఉన్నతాధికారులకు పలువురు విన్నవించారు.