నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదులు
హైదరాబాద్,ఫిబ్రవరి24(జనం సాక్షి): సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 20 శాతం ఒప్పందంతో వడ్డీకి రమ్య నగదును తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో భాదితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మాత్రం ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో గచ్చిబౌలి పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని సమచారం. ఐదుగురు భాదితులు నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు రమ్యపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రమ్యను గచ్చిబౌలి పోలీసులు విచారించనున్నారు.
రమ్య రఘుపతి వడ్డీకి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేశారని గచ్చిబౌలి సీఐ సురేష్ అన్నారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని తెలిపారు. ఇరువై శాతం వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారని, వాళ్ళకి చెక్‌లు ఇవ్వగా….ఆ చెక్‌లు బౌన్స్ అయినట్లు సీఐ చెప్పారు. రమ్య రఘుపతి 50 శాతం నగదును చెల్లించారని, మిగిలిన నగదు కట్టలేదని బాధితులు పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రమ్య రఘుపతిని పిలిపించి విచారిస్తామన్నారు. ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాలు కోరుతున్నట్లు చెప్పారు. నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేశారా? లేక ఆమె సొంతంగా డబ్బులు తీసుకున్నారా అనేది విచారణలో తెలుస్తుందని సీఐ సురేష్ పేర్కొన్నారు.




