Wednesday, 4 November 2026

అధికారంలో ఉండగా అభివృద్దిని మరచారు

ఇప్పుడేమో విమర్శలా: శ్రీనివాసగౌడ్‌
హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): అధికారంలో ఉన్నప్పుడు వీసమెత్తు పనిచేయని వారు ఇవాళ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని వారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక్కమాట మాట్లాడని నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు.  తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన  వారితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటే తమ నెత్తిన పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సవిూపిస్తున్నకొద్దీ బీజేపీకి బీసీలపై కొత్తగా ప్రేమ పుట్టుకొస్తోందని శ్రీనివాస గౌడ్‌ ఎద్దేవా చేశారు. అంత ప్రేమ ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కులవృత్తులను కాపాడేందుకే, బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. అన్ని కులాల్లోని పేదల కోసం పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కుల వృత్తులను పోత్సహించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గొర్రెలు, చేపల వంటి వాటని పంపిణీ చేస్తుంటేగొల్ల, కురుమలను అవమానించేలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో మళ్లీ పాత పాటే పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుల పాలిట శిఖండిలా వ్యవరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  తాజాగా గొర్రెల పంపిణీలో అవినీతి జరుగుతోందని విమర్శిస్తున్నారని చెప్పారు. ఒక్క గొర్రెను కొనుగోలు చేయకుండానే అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు.