అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడంతో వైన్ షాపును సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 20 (జనంసాక్షి): మద్యం బాటిల్లపై నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో ఎక్సైజ్ అధికారులు వైన్స్ ను సీజ్ చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 13వ తేదీన హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాల తనిఖీలలో మండల కేంద్రంలో ఉన్న నూకల విద్యాసాగర్ రెడ్డి వైన్ షాపులో మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తుండగ పట్టుకున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం వైన్స్ వారికి నోటీసులు ఇచ్చి వైన్స్ ను సీజ్ చేసినట్లు హాలియా ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ జి వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా గతంలో కూడా ఇదే విధంగా మద్యం అధిక ధరకు విక్రయించినందుకుగాను పెనాల్టీ విధించారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట ఎక్సైజ్ ఎస్సై రేఖ, సిబ్బంది తదితరులున్నారు.