ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):-అపరిచిత వ్యక్తుల నుండి తమ సెల్ ఫోన్లు, మెయిలకు వచ్చే సందేశాలకు స్పందించవద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ విద్యార్థులకు సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం, భరోసా, సైబర్ విభాగం అధ్వర్యంలో హనుమకొండ కిషన్పురలోని చైతన్య డ్రీమ్ యూనివర్సిటీలో విధ్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు. యూనివర్సిటీ విధ్యార్థులతో పాటు ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్న ఈ సదస్సుకు పరిపాలన విభాగం అదనపు డిసిపి ముఖ్య అతిధిగా హజరయినారు. ఈ సదస్సులో ముందుగా ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ఏవిధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరి బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ విభాగం సిబ్బంది పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ సదస్సుకు ప్రత్యేక అతిధిగా హజరయిన నిట్ ప్రొఫేసర్ ఆంజనేయులు సైబర్ నేరగాళ్ళ
భారిన పడకుండా తీసుకోవల్సి ముందస్తూ జాగ్రత్తలపై విధ్యార్థులకు సూచించారు. అనంతరం అదనపు డిసిపి మాట్లాడుతూ రోజు, రోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్ళు అదే స్థాయిలో నేరాలకు పాల్పడుతున్నారు. అదే విధంగా టెక్నాలజీ వినియోగించే వారి సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. ఇది దృష్టిలో వుంచుకోని సైబర్ నేరగాళ్ళు ప్రజల నుండి డబ్బును దోచుకోనేందుకు కోత్త, కోత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల ప్రారంభయిన 5జీ సేవలను దృష్టిలో వుంచుకోని సైబర్ నేరగాళ్ళు 4జీ నుండి 5జీ సేవల పేరుతో ప్రజల నుండి డబ్బును దోచుకుంటున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తం వుండాలని, ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు తమ వ్యక్తిగత సమచారంతో పాటు ఓటిపిలను తెలియజేయవద్దని, అదే విధంగా బ్యాంక్ సేవల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల సెల్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తం వుండటంతో పాటు, వారి మాటలకు స్పందించవద్దని. ఈ మధ్యకాలంలో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ నందులో శోధించడం సరికాదని, ప్రస్తుత రోజుల్లో సామాజిక మాద్యమాల వినియోగం అధికంగా వుంది. వీటి ద్వారా కూడా సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసి డబ్బులను దోచుకుంటున్నారని. ఎవరైన సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినట్లుగా గుర్తిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించడం ద్వారా పోగోట్టుకున్న సోమ్మును తిరిగి పొందే అవకాశం వుంటుందని అదనపు డిసిపి తెలియజేసారు.ఈ కార్యక్రమములో క్రైమ్ ఏసిపి డేవిడ్ రాజు, ఇన్ స్పెక్టర్లు సంజీవ్, జనార్ధన్ రెడ్డి, సువర్ణ,సుజాత, స్వచ్చంద సంస్థ ప్రతినిధి క్రాంతి, ఎన్.ఎస్.ఎస్ కోర్డినేటర్ డా. గోపినాథ్, ఐడిఎఫ్ సి బ్యాంక్ మేనేజర్ రాజేష్ అలిండియా రేడియో వ్యాక్యత మగ్గుంతో పాటు షీటీం, సైబర్, భరోసా మరియు ఏ.ఎచ్.టి.యూ సిబ్బంది పాల్గొన్నారు.
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలకు స్పందించకండి




