హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): చందానగర్ శంకర్ నగర్‌లో అపార్ట్ మెంట్‌లో పేలుడు సంభవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్‌లోని ప్లాట్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఇంటి యజమాని గణెళిష్(37), కుమార్తె శ్రీప్రియ(11)కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు రత్నమాల(50), లావణ్య (32)సురక్షితంగా బయటపడ్డారు. ఇంట్లో మొత్తం మూడు సిలిండర్లు ఉండగా.. ఒక సిలిండర్ గ్యాస్ అయిపోవడంతో పక్కన పెట్టారు. అదే ప్రాంతంలో పేలుడు జరిగింది. సిలిండర్ క్యాప్ కూడా పెట్టింది పెట్టినట్లే ఉంది. గ్యాస్ లీకైన దాఖలాలు లేవు ఐనా భారీ పేలుడుకు ప్లాట్ మొత్తం ధ్వంసం ఎలా అయిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పేలుడు పదార్థం నిల్వ ఉంచడంతో పేలుడు జరిగిందా? లేదా గ్యాస్ సిలెండర్ వల్ల ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబ సభ్యులు సైతం గ్యాస్ పేలుడు కాదని చెబుతున్నారు. దీంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.




