రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్(జనంసాక్షి): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపచేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కలెక్టర్ హరీశ్, జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన స్థలసేకరణ చేపట్టాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులైన అందరిపైనా ఉందని ఈ విషయంలో మనకు మనమే సాటిగా నిలిచేలా అభివృద్ధి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో ల్యాండ్ అలాట్మెంట్ కు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని సమన్వయంతో ముందుకెళ్ళాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వం సూచించిన పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధులకు ఏమాత్రం కొరతలేదని అధికారులు ముందస్తు ప్రణాళికతో పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి మల్లారెడ్డి వివరించారు. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా ట్యాక్స్‌లను కూడా సక్రమంగా వసూలు చేయాలని వాటితో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ముందుగా నోటీసులు జారీ చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు. దీంతో పాటు జిల్లాలో ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులను గుర్తించాలని పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులు పెట్టి ఆ పనులను కొత్త వారికి అప్పగించాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉందని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం వల్లే సాధ్యపడిందని అన్నారు. ప్రస్తుతం కూడా జిల్లాలో చేపట్టబోయే పనులకు ఇదే విధంగా అందరూ సమన్వయంతో కృషి చేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లాలో చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ సమస్యలు, సందేహాలను జిల్లా కలెక్టర్ హరీశ్ దృష్టికి తీసుకురాగా ఆయన వారి సందేహాలు నివృత్తి చేయడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా ప్రణాళిక అధికారి రాంమోహన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి పద్మజారాణి, ఆర్డీవోలు రవి, మల్లయ్యతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




