Tuesday, 3 November 2026

అరుణారుణ వర్ణంలో .. 

అరుదైన రూపం
– ఆకాశంలో కనువిందు చేసిన జాబిల్లి
– శుక్రవారం రాత్రి 11.44 నుండి తెల్లవారు జాము 4.59 వరకు కొనసాగిన గ్రహణం
– సుమారు 1.43 నిమిషాల పాటు బ్లడ్‌మూన్‌ దర్శనం
– ఈ శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన చందగ్రహణమని ప్రకటించిన నాసా
– టెలీస్కోప్‌ల సహాయంతో వీక్షించిన ప్రజలు
– జాబిల్లి పక్కనే కనువిందు చేసిన అంగారకుడు
– ఈనెల 31న భూమికి మరింత దగ్గరగా అంగారక గ్రహం
హైదరాబాద్‌, జులై28(జ‌నం సాక్షి) : వెండివెన్నెల వెదజల్లే చందమామ ఎరుపెక్కాడు. ధవళకాంతులకు బదులు రుధిర వర్ణాన్ని పులుముకున్నాడు. అరుణారుణ వర్ణంలో అరుదైన రూపంలో దర్శనమిచ్చాడు. అంతేకాదు అరుణ కాంతుల జాబిల్లి పక్కనే అంగారకుడు కనువిందు చేశాడు. ఈ శతాబ్దపు సుదీర్ఘ చందగ్రహణం శుక్రవారం అర్థరాత్రి దాటిని తరువాత వినీలాకాశంలో వింతైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. బ్లడ్‌ మూన్‌ కాంతుల్లో అంగారకుడి దర్శనం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ మధురానుభూతిని మిగిల్చింది. దాదాపు ఐదున్నర గంటల పాటు కొనసాగిన చందగ్రహణం 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచిపోయింది. దాదాపు 103 నిమిషాల పాటు అరుణ జాబిలి ఆకాశంలో సందడి చేసింది. అరుణ జాబిలి పక్కనే మిణుకు మిణుకు మంటూ అంగారకుడు సైతం మెరిశాడు. కొన్ని దేశాలు మినహా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ ఈ అరుదైన దృశ్యం అలరించింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడ్తాయి. అయితే సంపూర్ణ చంద్ర గ్రహణం ఎప్పుడొచ్చినా బ్లడ్‌ మూన్‌ దర్శనం సహజమే. కానీ ఇదే సమయంలో అంగారకుడు కూడా భూమికి అతి చేరువగా రావడంతో అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాత్రి సరిగ్గా 11.44 గంటలకు చందగ్రహణం ప్రారంభమైంది. భూమి నీడ క్రమక్రమంగా చంద్రుడిపై పడటంతో అంబ్రల్‌ ఫేజ్‌ మొదలైంది. దీంతో మూన్‌ కొద్ది కొద్దిగా మాయమవడం మొదలైంది. ఇక రాత్రి ఒంటిగంటకు భూమి నీడ పూర్తిగా చంద్రున్ని కమ్మేయడంతో.. గ్రహణం అంబ్రల్‌ ఫేజ్‌ నుంచి టోటాలిక్‌ ఫేజ్‌కు చేరుకుంది. చంద్ర గ్రహణం సంపూర్ణ దశకు చేరిన  ఈ సమయంలోనే వక్రీభవన సూర్య కిరణాల మూలంగా బ్లడ్‌ మూన్‌ దర్శనమిచ్చింది. అరుణ వర్ణంలో అరుదైన జాబిలి అంబరాన కనువిందు చేసింది. అద్భుతమైన చంద్ర గ్రహణం అనుభూతిని రెట్టింపు చేసేందుకు అంగారకుడు కూడా జోడీ కట్టాడు. భూమికి అత్యంత చేరువగా వచ్చిన అంగారకుడు.. బ్లడ్‌ మూన్‌తో కలిసి దర్శనమిచ్చాడు. దాదాపు గంటా 43 నిమిషాల పాటు ఈ బ్లడ్‌ మూన్‌ కనిపించింది. ఈ శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన చందగ్రహణమని నాసా ప్రకటించింది. వినువీధిలో నెలకొన్న ఈ అద్భుతాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు ఆశ్చర్యానుభూతికి లోనయ్యారు. మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలకు బ్లడ్‌ మూన్‌ దర్శనమిచ్చింది. బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, పుణె తదితర నగరాల ప్రజలకు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఖగోళ ప్రియులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఈ అరుదైన దృశ్యాన్ని చూసి వింత అనుభూతికి లోనయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజలు కూడా సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించారు. అయితే యూరప్‌, దక్షిణ అమెరికా, ఆస్టేల్రియా వాసులకు మాత్రం గ్రహణం పాక్షికంగా కనిపించింది. ఉత్తర అమెరికా, అంటార్కిటికా, రష్యాలోని ఉత్తర
ప్రాంతాల్లో పగటి సమయం కావడంతో అక్కడి ప్రజలు ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు. ఈ సారి బ్లడ్‌ మూన్‌ వీక్షించలేని వారు మళ్లీ 2025 సెప్టెంబరు 7 వరకు ఆగాల్సిందేనని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మొత్తంగా 11.44 గంటలకు ప్రారంభమైన చంద్ర గ్రహణం తెల్లవారుఝామున 4.59 వరకు కొనసాగింది. గ్రహణం సంపూర్ణ దశలో ఉన్నంత సేపు దాదాపు 103 నిమిషాలు బ్లడ్‌ మూన్‌ కనిపించింది. అరుణ జాబిలి పక్కనే అంగారక గ్రహం కూడా అలరించింది. భూమికి అత్యంత చేరువగా వచ్చిన అంగారక గ్రహం మరో నాలుగు రోజుల పాటు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 31న అంగారకుడు భూమికి అత్యంత చేరువగా వచ్చి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని వెల్లడించారు.