అర్చకులంతా గర్వించదగ్గ వ్యక్తి వలివేటి వీరభద్రశర్మ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్చకులంతా గర్వించదగిన వ్యక్తి జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు వలివేటి  వీరభద్ర శర్మ అని దేవాదాయశాఖ ఈఓ ఎంపీ లక్ష్మణరావు , భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు , ఆలయ కమిటీ చైర్మన్ కొత్తా ఆంజనేయులు , వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ అన్నారు.ఇటీవల ఉమ్మడి జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షులుగా నియామకమైన వలివేటి వీరభద్ర శర్మను ఆదివారం స్థానిక భక్తాంజనేయ స్వామి  దేవాలయంలో ఘనంగా సన్మానించి మాట్లాడారు.గతంలో ఎన్నో పదవులు అలంకరించిన వీరభద్ర శర్మ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు.ఆలయ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో విశేష కృషి చేసిన  ఆయన అదే రీతిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అనంతరం వలివేటి వీరభద్ర శర్మ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల మిగిలిన సమస్యల పరిష్కారం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో  పలు ఆలయాల అర్చకులు పాల్గొన్నారు.