హైదరాబాద్,డిసెంబర్20(జనంసాక్షి): ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి సవిూపంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి ఓ బస్సుకు నిప్పుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిలిపి ఉంచిన బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఓ బస్సు పాక్షికంగా దగ్ధమైంది. మరో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. సీసాలో పెట్రోలు తీసుకువచ్చి దుండగులు బస్సుపై పోసి నిప్పంటించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పెట్రోల్ తీసుకువచ్చిన సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడి ఉంటారన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




