హైదరాబాద్,డిసెంబర్20(జనంసాక్షి): అనుకోకుండా ఇంజినీరింగ్ కళాశాల బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట గ్రామం నుంచి పసుమాముల వైపు జాతీయరహదారి దాటి ఆర్టీసీ బస్సు వెళ్తుండడంతో, అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు తన వాహనాన్ని పక్కకు ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న మధుశాలిని(12) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. కొత్తపేటకు చెందిన మధుశాలిని ఏడో తరగతి చదువుతోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.




