Wednesday, 4 November 2026

అవినీతి కేసులో.. 

ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు
– ఉత్తర్వులు జారీ చేసిన నగర పీసీ అంజనీకుమార్‌
హైదరాబాద్‌, జులై6(జ‌నం సాక్షి ) : ద్విచక్ర వాహనం చోరీ కేసులో రికవరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని భాదితుడికి తిరిగి ఇచ్చేందుకు లంచం అడిగిన చిలకలగూడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటాద్రిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు నగర సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్‌ నమలాగుండుకు చెందిన సంతోష్‌ కుమార్‌, మే 17న తన ద్విచక్ర వాహనం చోరీ జరిగిందని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా 20 రోజుల అనంతరం హైదరాబాద్‌ నగర శివారు కొంపల్లిలో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు సంతోష్‌కు ద్విచక్ర వాహనం దొరికిందని పోలీసులు సమాచారం ఇచ్చారు. చోరీ చేసిన వ్యక్తి సంతోష్‌కు దగ్గర బంధువు కావడంతో తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటానని పోలీసులకు చెప్పాడు. అలా తీసుకోవడానికి వీలు లేదని, అతడిని అరెస్టు చేస్తామని సదరు ఎస్సై సంతోష్‌కు చెప్పారు. దీనికి తోడు తన వాహనాన్ని తనకు ఇవ్వడానికి లంచం ఇవ్వాలని అడగడంతో తన మామ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి అనిశా అధికారులను
ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్‌ రాజేష్‌ లకు 41 సీఆర్పీసీ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం నగర సీపీకి నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఎస్సై వెంకటాద్రిని సస్పెండ్‌ చేస్తూ నగర సీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.