యాదాద్రి భువనగిరి,అక్టోబర్27(జనంసాక్షి): పుణ్యక్షేత్రమైన యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో తిరుమల తరహాలో ఆలయ నగరిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని పోలీసులు నిర్ణయించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటంతోపాటు నిఘా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్లో గుట్కా, పాన్ మసాల, మద్యం నిషేధించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి పవిత్రతను కాపాడే లక్ష్యంగా రాచకొండ కమిషనరేట్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. యాదాద్రి, పరిసరాల్లో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించడంతోపాటు భద్రత పెంచేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతో పూర్తిగా అరికట్టే చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం కావడం.. గత కొన్ని దశాబ్దాలుగా వ్యభిచార గృహాలు కొనసాగుతుండటం మాయని మచ్చగా మిగిలింది. ఇటీవల కాలంలో లాడ్జీలు అక్రమ జంటలకు నెలవుగా మారాయి. గతంలో జరిగిన దాడుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమ జంటలే ఎక్కువగా పట్టుబడ్డాయి. ఇక ముందు వీటికి పూర్తిగా నిరోధించాలన్న లక్ష్యం.. వ్యభిచార గృహాల నిర్వాహకులు, లాడ్జీల యజమానుల్లో భయం కలిగించేందుకు మున్ముందు విస్తృత దాడులను ఇటీవల చేపట్టారు. యోచిస్తున్నారు. ఎస్వోటీ బృందంతోపాటు మరికొన్ని బృందాలను ఏర్పాటు చేసి యాదాద్రి, దాని పరిసరాల్లో నిఘా పెంచడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణిచివేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.యాదాద్రి, భువనగిరిలో వ్యభిచార కార్యకలాపాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల యాదగిరిగుట్ట పట్టణంలోని వ్యభిచార గృహాలు నిర్వహించే ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి, సోదాలు జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో విలీనమయిన నేపథ్యంలో యాదాద్రిలోనూ ప్రత్యేకంగా ఏసీసీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. భవిష్యత్లో దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున అక్కడ భద్రత పెంచడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై నివేదికను రూపొందించారు.




