Friday, 6 November 2026

అసెంబ్లీ కార్యదర్వికి హైకోర్టు నోటీసు

శాసనసభ్యుల పిటిషన్‌పై తాఖీదు

హైదరాబాద్‌,జూన్‌15(హో): తమ శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శికి తాఖీదులు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 13వ తేదీకి వాయిదా వేసింది. తమ సభ్యత్వాలను అకారణంగా రద్దు చేశారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి వినతిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ గతంలో తెరాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత పరిణామాలన్నీ వివరిస్తూ కాంగ్రెస్‌ సభాపక్షనేతలు సభాపతి మధుసూదనాచారిని కలిశారు. వారిద్దరి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరారు. అయినా స్పందించకపోతే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సభ్యత్వాలను పునరుద్ధరించకపోవడంతో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయ, శాసనవ్యవహారాల శాఖ కార్యదర్శి నిరంజన్‌ రావుకు నోటీసులు జారీ చేసింది. జులై 13లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.