Thursday, 5 November 2026

ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాం

ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్,
ఖానాపురం సెప్టెంబర్ 18జనం సాక్షి
ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాం అని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్, అన్నారు. ఆదివారం మండలం అశోక్ నగర్ గ్రామంలో కస్తూర్బాగాంధీ బాలికల  విద్యాలయం లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్పెషలాఫీసర్- పి.మేనక అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ
 జీవితం జీవించడానికే నని, తాత్కాలిక సమస్యలకు  నిండు జీవితాన్ని బలి చేయవద్దని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ , సైకాలజిస్ట్  ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు లు – డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు.   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బతికి శోధించి -సాధించాలని, వైఫల్యాన్ని వెక్కిరించి మరో ప్రయత్నంలో విజయానికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలపై ప్రజలను, యువతను,విద్యార్థులను అవగాహన కల్పించడం కోసం   గత పది సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకై వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తూ, ఇప్పటివరకు 28 మందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగామనీ అన్నారు. చిన్న చిన్న సమస్యలకు యే  ఒక్కరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఎటువంటి సమస్యలు ఉన్న పెద్దల దృష్టికి తీసుకువచ్చి జీవితాన్ని చక్కపరచుకోవాలని కోరారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న సైకాలజిస్ట్ డాక్టర్ సృజనా రెడ్డి మాట్లాడుతూ కౌమారదశలో వయస్సు రీత్య వచ్చే ఉద్వేగాలను సమన్వయపరచుకొని ,పెద్దల సూచనలతో ముందుకు సాగాలని తెలిపారు. యోగాచార్యులు ముల్క ఐలయ్య మాట్లాడుతూ మెడిటేషన్, ధ్యానము, యోగా లు మనసును, మనిషిని మరియు శరీరాన్ని సమన్వయ పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని అన్నారు .అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి  ఆత్మహత్యలను నివారించి నిండు జీవితాలలో వెలుగులు నింపుదాంఅంటూ  ప్రమానం చేయించారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ,కస్తూర్బా విద్యాలయ సిబ్బంది నిరోష, అన్నపూర్ణ, సుచరిత, విజయ, శిరీష ,జ్యోతి, శారద, లతోపాటు విద్యార్థినులు పాల్గొన్నారు.