Wednesday, 4 November 2026

ఆమె గెలుపు… ప్రగతికి మలుపు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్

 

 

 

 

 

 

 

 

వీణవంక మార్చి 8 .(జనం సాక్షి) వీణవంక మహిళ అనే పదం ఈ మహిలోనే గొప్ప సృష్టి అని.అందం, ఆలోచన, అనుకువ,వివేకం, నేర్పు, బుద్ధి కుశలత, ఓపిక, సహనం అన్నింటి ప్రతిరూపమే స్త్రీ అని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేలపైనుండి-నింగి వరకు ఆమె విజయాలు అనితర సాధ్యమైనవని, అందుకే ఆమె విజయాలను గుర్తించడం, మహిళల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గౌరవించడం, లింగ సమానత్వం, మహిళలపై హింస, సమాన హక్కులు వంటి అంశాలపై చర్చించేందుకు, మహిళ సాధికారత దిశగా నడిపించడం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు. 1951లో 9% గా వున్న మహిళా అక్షరాస్యత 2022 నాటికి 70.3% పెరిగిందన్నారు. లింగ నిష్పత్తిలో 1020 తో ప్రపంచ లింగ నిష్పత్తి 1016 కన్నా మెరుగైన స్థాయిలో ఉన్నామన్నారు. గతంలో కన్నా 0.6% పెరిగి 19.23%తో ఉపాధి కల్పనతో దేశం ముందుకు వెళ్తుంద అన్నారు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 93% మహిళా ఉపాధి కల్పనతో తెలంగాణ రాష్ట్రం దేశంలో కెల్లా ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో మహిళల కృషి అనితర సాధ్యమైనదని, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిపుష్టికి మహిళ మానవ వనరులు అత్యంత ఆవశ్యకమన్నారు. మహిళలకు పరిపుష్టిని అందించి, మహిళా సాధికారత సాధించాల్సిన అనివార్యత ప్రభుత్వాలపై ఉందని, అందువల్ల మహిళలపై జరిగే హింస, దాడులను, అకృత్యాలను, అన్యాయాలను, అణచివేతలను అరికట్టి సత్వర న్యాయం జరిగేలా చట్టాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.