అంచనాలు సిద్దం చేసిన ఉద్యానశాఖ
హైదరాబాద్,జూలై30(జనం సాక్షి): ఖమ్మం జిల్లాలో లాభాలు పండిస్తున్న ఆయిల్‌పామ్ పంటలను ఇతర ప్రాంతాల్లో పండించేందుకు ఉద్యానశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి రైతులకు ఆదయం గిట్టుబాటవుతోంది. దీంతో వంటనూనెల దిగుబడి కూడా వస్తోంది. దీంతో రైతుల ఆదాయం పెంచడంతో పాటు నూనె అవసరాలను తీర్చేందుకు ఆయిల్‌పాం తోటల సాగును విస్తరించాలని ఉద్యానశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిలాల్లో పెద్ద ఎత్తున ఆయిల్‌పాం సాగులో ఉంది. ఇందుకోసం ఆయిల్‌పాం సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందడానికి ఆయిల్‌పాం సాగులో మంచి అవకాశాలున్నట్టు ఉద్యానశాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగుకు ఉన్న అవకాశాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం 170 మండలాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టే అవకాశాలున్నాయి. దాదాపు 3.75 లక్షల ఎకరాల్లో సాగుచేయడానికి అనుకూలమైన భూములున్నట్టు ఉద్యానశాఖ భావిస్తున్నది. ఆయిల్‌పాంను ప్రోత్సహించేందుకు కేంద్రం మొక్కల కొనుగోలు వ్యయంలో 85 శాతం రాయితీగా అందిస్తున్నది. ప్రస్తుత ధరలతో లెక్కిస్తే ఏటా దాదాపు రూ.250 కోట్లకు పైగా ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ సంచాలకుడు ఎల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయిల్‌పాం సాగు విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలోనే 6వ స్థానంలో, పండ్ల గెలల దిగుబడిలో 2వ స్థానంలో ఉన్నది. ఏటా 4.40 లక్షల టన్నుల నూనెలు రాష్ట్రానికి అవసరం కాగా.. లక్ష 12 వేల టన్నులే అందుబాటులో ఉన్నాయి. వంటనూనెల వినియోగంలో 40 శాతం వరకూ పామాయిల్ ఉన్నది. 2025 నాటికి 10.56 లక్షల టన్నుల వంటనూనెలు అవసరమని అధికారులు గుర్తించారు. పంట సాగుకు వాతావరణం అనుకూలంగా ఉన్న 170 మండలాల్లోని 3.75 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభిస్తే రానున్న ఎనిమిదేండ్లలో అదనంగా 5.4 లక్షల టన్నుల ఆయిల్‌పాం ఉత్పత్తి చేసేందుకు అవకాశమున్నది.




