అలాంటి వారికి ప్రోత్సాహకాలు రద్దు చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్,జూలై30(జనం సాక్షి): ప్రభుత్వం రాయితీతో అందచేసిన గొర్రెలను అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై టాస్క్ఫోర్స్ పనిచేస్తోందని, ఎవరు అమ్ముకున్నా వారి సబ్సిడీ రద్దు కావడమే గాకుండా మళ్లీ పథకాలను, రాయితీలను పొందడానికి అనర్హులను చేస్తామని ప్రకటించింది. అక్రమంగా తరలిస్తున్న రాయితీ గొర్రెలను ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు లారీల్లో ప్రభుత్వం రాయితీపై అందించిన గొర్రెలను చౌకగా కొనుగోలు చేసి ఏపీలోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని పలు పట్టణాలకు తరలిస్తున్నారు. ఇలా రెండు లారీల్లో కొందరు 648 గొర్రెలను తరలిస్తుండగా రైతు అవగాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య యాదవ్ ఇతర నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలానగర్ పశువైద్య అధికారి రఘు విచారణ జరిపారు.లారీల్లో తరలిస్తున్న మొత్తం 648 గొర్రెల్లో 130 గొర్రెలను ప్రభుత్వం లబ్దిదారులకు రాయితీపై అందించినవిగా గుర్తించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో గొర్రెను రూ.3,200 కొనుగోలుచేసి రూ.3,800 నుంచి నాలుగు వేల వరకు విక్రయిస్తారని విచారణలో తేలిందని ఆయన చెప్పారు. లారీలను స్వాధీనం చేసుకుని, గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ వివరించారు. ఈఘటనతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని వెల్లడించింది.




