ఆరోగ్యతెలంగాణే లక్ష్యం
` ఆరోగ్య సూచిల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలి
` వైద్య సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలి
` పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి
` ఆరోగ్య శాఖ అధికారులకు సూచించిన మంత్రి హరీష్
హైదరాబాద్,నవంబరు 27(జనంసాక్షి):ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్ లైన్లో నమోదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమైన పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సవిూక్షలో కమిషనర్ వాకాటి కరుణతో పాటు, ఆశ, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, మిడ్ వైఫెరీ, ఆర్‌బీఎస్‌కే, హెచ్‌ఎంఐఎస్, టీబీ, టీ డయాగ్నొస్టిక్స్, 108, 104, యూపీహెచ్‌సీ, సాంక్రమిక, అసంక్రమిక వ్యాధులు, ప్లలె దవాఖానలు, పీహెచ్‌సీలు, వాక్సినేషన్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సవిూక్షలు నిర్వహించుకోవాలని, ప్రతి నెల విభాగాల వారీగా తాను సవిూక్ష నిర్వహిస్తాన్నారు. పనితీరులో నెలవారీ వృద్ది కనిపించాలని, పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటురాయి అని మంత్రి పేర్కొన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి, రిపోర్టులు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నదని, అదే స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో శ్రద్ద చూపించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉండాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశ్రుభ్రతను మెరుగుపరుస్తూ, దోమల నివారణ చర్యలు చేపట్టాలని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, ఆస్పత్రి ప్రసవాలను 97 శాతం నుండి 100 శాతానికి పెంచడం లక్ష్యంగా పని చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో క్యాథ్ ల్యాబ్స్ సిద్ధం కావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మంలోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.