– టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మావోయిస్టు నేత జగన్ బహిరంగలేఖ
హైదరాబాద్, అక్టోబర్7( జనం సాక్షి ) : ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ఉద్దేశపూర్వంగా ఆర్టీసీని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ నెపాన్ని కార్మికులపై నెడుతుందని మావోయిస్ట నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వం తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని తన లేఖలో ఆరోపించిన జగన్.. తమ డిమాండ్లు సాధించే వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించొద్దని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పౌరుల ప్రాథమిక హక్కులను, వాక్ స్వాతంత్రాన్ని కాల రాస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చెయాలన్న కుట్రతోనే ఆర్టీసీ విలీనం చెయ్యటం లేదని, ప్రభుత్వమే ఆర్టీసీ యాజమాన్యాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.




