హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఏడాది కావస్తోంది. అయినా ఆర్టీసీ విభజన మాత్రం పూర్తికాలేదు. సంస్థలో ఉన్న సమస్యలు, ఇతరత్రా కారణాల రిత్యా విభజన ఆలస్యమవుతూ వచ్చింది. అయితే.. ఈ వ్యవధి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు తాత్కాలిక విభజనకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతలను ఎండీకి అప్పగించారు. తెలంగాణకు చెందిన జెఎండి, ఎపి మంత్రి శిద్దా రాఘవరావుతో చర్చించాక ఎండి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఎ బ్లాక్ ఏపీ, బి బ్లాక్ ను తెలంగాణకు
బస్ భవన్ లోని ఎ బ్లాక్ ను ఏపీ, బి బ్లాక్ ను తెలంగాణకు కేటాయించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లో సంస్థకు చెందినవారు 948 మంది రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు. వీరిని రెండు రాష్ట్రాలకూ కేటాయించారు. తెలంగాణ, ఏపీలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా విభజించనున్నారు. ఇప్పటికే ఖరారైన కేటాయింపులకు ఆమోద ముద్ర వేయనున్నారు. బస్ భవన్ లో ఉన్న నలుగురు ఈడీల్లో తెలంగాణకు ముక్కాల రవీందర్, నాగరాజులను, ఏపీకి ఏవీ రావు, జయరావులను కేటాయించినట్టు సమాచారం. గ్రేటర్ ఈడీ పురుషోత్తం నాయక్, కడప ఈడీ కోటేశ్వరరావుల కేటాయింపులు మాత్రం తేలాల్సి ఉంది.
జయరావును ఏపీకి కేటాయించడంతో వివాదం
అయితే… జయరావును ఏపీకి కేటాయించారని తెలియడంతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సూపర్ వైజర్ల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావు.. తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు. కానీ ఆయనను ఏపీకి కేటాయించడంతో వివాదం నెలకొంది. మొత్తానికి బస్‌భవన్ విభజనకు తాత్కాలికంగానైనా ముహూర్తం కుదిరింది. ఇకనైనా సంస్థ అభివృద్ధి గాడిలో పడుతుందో లేదో చూడాలి.




