చెరువుల్లో చేపల ఉత్పత్తితో గణనీయంగా మార్పులు
హైదరాబాద్,మే31(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం జలసిరి ఉన్న చోట మత్స్యసిరి కూడా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 44 వేల చెరువులకు సుమారు రూ.50 కోట్ల వ్యయంతో చేప పిల్లలను మత్స్యశాఖ కార్మి కులకు నూరుశాతం సబ్సిడీతో అందించారు. ప్రతీ మత్స్య కార్మికుడు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నీలివిప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో మత్స్య,బెస్త కులాలతో పాటు రైతులు, ఆసక్తి ఉన్న ఇతరులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రానున్న రోజుల్లో మత్స్య ఉత్పత్తిని పెంచేందుకు మత్స్యశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయంతో సహకార సంఘాలు బలో పేతం కానున్నాయి. ఉచితంగా అందించే చేప పిల్లలపై కార్మికులు దృష్టి సారించారు. పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, ఇతరులు నేరుగా అధికారులను సంప్రదిస్తున్నారు. సొసైటీల పరిధిలో ఉన్న వారికి వలలు, వ్యాపారాభివృద్ధికి సైకిళ్లు, నిల్వ ఉంచేందుకు ఐస్ బాక్సులను ప్రభుత్వం అందజేయనుంది. అంతేకాకుండా సొసైటీలో ఉన్న వారికి జీవితబీమాను సైతం రూ.2 లక్షలకు పెంచింది. మరిన్ని సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేలా మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు పంపించి తర్ఫీదు ఇప్పిస్తున్నారు. అనుబంధ రంగాల్లో ఉన్న వారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతే కాకుండా కేజ్ కల్చర్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు ద్వారా పలు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేశారు. ఈ బృహత్తర విధానంతో చేపల పెంపకం వృత్తిగా ఉన్న ముదిరాజులు, గంగపుత్రులతో పాటు ఈ వత్తిలో ఉన్న ఇతర కూలీల వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల కుటుంబాలు నదులు, చెరువులు,
కుంటలు ఏ ప్రాంతాల్లో ఉంటే అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని పూరిగుడిసెల్లో కాపురాలు చేసుకుంటారు. దాని వల్ల చెరువులతో ఆ కుటుంబానికి అనుబందం పెరిగేది. ఆ అనుబంధంతోటే చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కారుల కుటుంబాలు అభివృద్ధి దిశలో పయనించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్ తరాలకు ఉపయోగ పడనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జాలరుల కుటుంబాలకు నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలు ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎవరికి వారే చేపలను పెంచుకోవడం, విక్రయాలు సాగించడం, మధ్యదళారులు దండుకోవడం జరిగేది. ఇక అలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారుల కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో సభ్యులుగా ఉండాలన్న నిబంధన పెట్టారు. ప్రభుత్వం మత్స్యకారుల సంఘాలకు నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తజిల్లాలో ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ముందులోనే ఉన్నాం. భవిష్యత్తులో మత్స్యకారులకు రుణ సౌకర్యం కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతామన్న విశ్వాసంతో ఉన్నారు.
ఆర్థికంగా బలపడుతున్న మత్స్యసంఘాలు




