హైదరాబాద్: ‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉంది. ఆశించినంత ఆదాయం వస్తోంది. అనుకున్నదాని కంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక లక్ష్య సాధనలో ఎక్కడా వెనుకబడలేదు…’ అని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలకు.. సీఎం నిర్దేశించిన కార్యక్రమాలకు ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. నిధులు రాబట్టడంలోనూ… ఖర్చు చేయడంలోనూ వెనకాడేది లేదన్నారు. ఏ నెలకు ఆ నెల లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని, భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఆశించినంత ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి ఈటెల రాజేందర్ ‘సాక్షి’ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు వస్తే ఆర్థికంగా తెలంగాణ మరింత పరిపుష్టమవుతుందన్నారు. మొత్తం రూ.11,960 కోట్లు కేంద్ర నిధులు రావాల్సి ఉందని, రెండు నెలల్లోనే వాటిని తెచ్చుకోవాల్సి ఉందని అన్నారు. అన్ని శాఖల మంత్రులు ఢిల్లీ వెళ్లి ఆ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కొత్త రాష్ట్రమైనందున తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీగా రూ.5,000 కోట్లు ఇవ్వాలని కోరామని, ఆ గ్రాంటు వస్తుందనే అంచనాతో బడ్జెట్లో కూడా పొందుపరిచామన్నారు. ‘2015-16 బడ్జెట్‌కు సంబంధించి కసరత్తు ప్రారంభించాం. ఈ ఏడాది రూ. ఒక లక్షా 637 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. వచ్చే బడ్జెట్ అంత కంటే భారీగానే ఉంటుంది. మరింత మెరుగైన ఆర్థిక ప్రణాళికలుంటాయి. ఈసారి ప్రజలకు మరింత చేరువయ్యే తరహాలో బడ్జెట్‌ను రూపొందిస్తాం..’ అని ఈటెల పేర్కొన్నారు. ‘సన్న బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాలకు సైతం పంపిణీ చేయాలనే ఆలోచన ఉంది. సంబంధిత ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సైతం పంపిణీ చేయాలంటే ఏటా మొత్తం 2.5 లక్షల టన్నుల బియ్యం అవసరం..’ అని మంత్రి చెప్పారు.
ఐదు ప్రాధాన్యాంశాలు
తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా ఐదు ప్రాధాన్యాంశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ‘ మొదటిది సంక్షేమం.. ఇందులో పెన్షన్లు, సన్న బియ్యం, రేషన్ బియ్యం పరిమితి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు భూముల పంపిణీ తదితర పథకాలు ఉన్నాయి.
రెండోది విద్యుత్.. ఇందులో భాగంగా కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు, విద్యుత్ కొరతను అధిగమించే చర్యలు చేపడుతాం. మూడోది తెలంగాణ వాటర్ గ్రిడ్. నాలుగోది మిషన్ కాకతీయ కాగా.. ఇక ఐదవది రోడ్లు, రహదారుల అభివృద్ధి..’ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాల అమలు, నిర్వహణలోనూ పారదర్శకంగా ఉంటున్నామన్నారు.




