హైదరాబాద్,జూలై27(జనం సాక్షి): వ్యాసపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికితోడు చంద్రగ్రహణం ఉండడంతో సాయంతంరం ఆలయాలు మూతవేయనుండంతో ప్రత్యేక పూజలు చేపట్టారు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడుగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాన అంధకారాలను పారద్రోలి విజ్ఞాన, వికాసాల వైపు మనిషిని నడిపించే మ¬న్నత వ్యక్తి గురువు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణమిగా హిందువులు జరుపుకుంటారు. వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజు ఇది. జగతిని జాగృతపరిచిన దత్తాత్రేయుడు, రాఘవేంద్రుడు, సాయినాథుడు ఇలా ఎందరో గురుదేవుళ్లను ఈ గురుపూర్ణిమ పర్వదినాన కొలవడం ఆనవాయితీ. అలాంటి వారిలో శ్రద్ధ, సబూరీ దివ్యమంత్రాలను ప్రబోధించిన సద్గురు షిరిడి సాయి అగ్రగణ్యుడు. సాక్షాత్తు దత్తాత్రేయుడి అంశగా బాబాపూజలు అందుకుంటున్నాడు. సత్యవాక్కులతో భక్తజనులను చైతన్యపరిచిన సాయిదేవుడి స్థిర నివాసం షిరిడి. మహారాష్ట్రలోని ఈ దివ్యధామం సాయి పాద స్పర్శతో మహిమాన్వితమైంది. ఈ షిరిడి దివ్యక్షేత్రంలో గురుపూర్ణిమ ప్రత్యేక పూజలు అత్యంతవైభవంగా ఆరంభమయ్యాయి. షిరిడితోపాటు తెలుగురాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. దీంతో సాయిబాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
పల్లకిలో బాబా ఊరేగింపు
గురుపౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఉదయం నుంచే ఆలయం సందడిగా మారింది. అనంతరం సాయిబాబాను పల్లకిలో ఊరేగించారు. గ్రామ వీధుల నుంచి మాలకొండూరు చెరువు కట్టవరకు ఈ ఊరేగింపు ర్యాలీని నిర్వహించారు. భక్తులు బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గట్టుదుద్దెన పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలోని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాను సవిూప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు.




