Tuesday, 3 November 2026

ఆస్తి దక్కదని భర్తను హత్య చేసిన ఇల్లాలు

అమీర్‌పేట: పరాయి మహిళ మోజులో పడి ఆస్తి తమకు దక్కకుండా చేస్తున్నాడనే అక్కసుతో కట్టుకున్న భర్తను హతమార్చింది ఓ ఇల్లాలు. హత్య మిస్టరీని 24 గంటల్లోనే ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సీఐ రమణగౌడ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మృతుడు మైత్రి మారుతి(59) బతుకుదెరువు కోసం పదిహేను సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. బోరబండ స్వరాజ్‌నగర్‌లో ఇల్లు కట్టుకొని నివసిస్తూ భరత్‌నగర్‌ రైల్వేషెడ్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబసభ్యులను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయమై భార్య తేజమ్మ పలు మార్లు గొడవపడింది. మారుతి మనస్సు మార్చుకోకపోవడంతో ఏడాది క్రితం ఇద్దరూ విడిపోయారు. నలుగురు కుమార్తెలతో కలిసి పాత హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని అంజునగర్‌లో నివసిస్తోంది. కుమారుడు అబ్రహాం మాత్రం తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఈ నెల 22న రేషన్‌ సరుకులు తీసుకునేందుకు రెండో కుమార్తె సురేఖతో కలిసి తేజమ్మ స్వరాజ్‌నగర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా భర్తతో గొడవ పడింది. కోపోద్రిక్తుడైన మారుతి అతిగా మాట్లాడితే ఆస్తి మొత్తం తనతో ఉంటున్న మహిళకు రాసిస్తానంటూ హెచ్చరించాడు. ఆస్తి తమకు దక్కదని నిర్ధారణకు వచ్చిన తేజమ్మ భర్తను హత్య చేసేందుకు పథకం రూపొందించింది. సోదరుడితో మాట్లాడి ఇస్నాపూర్‌ నోబెల్‌ ట్రాన్స్‌ పోర్టులో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్‌కుమార్‌ తివారీతో హత్యా విషయం చర్చించారు. ఇందుకు అంగీకరించిన తివారి ఈ నెల 23న బోరబండ రైల్వే స్టేషన్‌కు తేజమ్మ, సురేఖతో కలిసి సాయంత్రం 8 గంటలకు చేరుకున్నారు. మారుతి గురించి కొడుకుతో ఫోన్‌లో మాట్లాడింది. రాత్రి 11.30గంటలకు ఇంటికి చేరుకున్న మారుతి గాఢనిద్రలోకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని బోరబండ రైల్వేస్టేషన్‌లో ఉన్న తల్లి తేజమ్మకు తెలిపాడు, మారుతి కాళ్లను భార్య, కుమారుడు గట్టిగా పట్టుకోగా అజయ్‌కుమార్‌ తివారి పదునైన గొడ్డలి లాంటి ఆయుధంతో తల కింది భాగంలో నరకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతి చెందాడని నిర్ణయించుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అబ్రహాం ఏమీ తెలియనట్టు 100కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. సీఐ రమణగౌడ్‌ సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి హత్య వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తమదైన శైలిలో ప్రశ్నించగా ఆస్తి తమకు దక్కదని హత్య చేసినట్టు తేలిందని ఏసీపీ చెప్పారు.
రూ. వేయి సుపారీకోసం హత్య
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అంబేద్కర్‌నగర్‌ జిల్లా బసంతాపూర్‌కు చెందిన అజయ్‌కుమార్‌ తివారి వేయి రూపాయలు, ల్యాప్‌టాప్‌ కోసం మారుతిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *