హైదరాబాద్,జూన్5(జనం సాక్షి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ఎంసెట్-2018 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల పక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు ఆఫీసర్ బీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి తగ్గింది. దీంతో రెగ్యులర్ డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఇదిలావుంటే దేశంలో 94 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి పనికిరారని టెక్ మహీంద్రా సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కావాల్సింది నైపుణ్యం ఉన్న ఉద్యోగులని ఓపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఢిల్లీలాంటి నగరంలో ఇంటర్‌లో 60 శాతం మార్కులు వచ్చిన ఏ విద్యార్థీ బీఏ ఇంగ్లిష్ చదువడం లేదు. వారంతా కచ్చితంగా ఇంజినీరింగ్‌లోకే వెళ్తున్నారు. దీని ద్వారా మనం చేస్తున్నదేమిటి? నిరుద్యోగం కోసం మనుషులను తయారు చేస్తున్నట్టుగా ఉన్నది. ఐటీ రంగానికి కావాల్సింది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. సైబర్ భద్రత రంగలో 2022 నాటికి 60 లక్షల మంది ఉద్యోగులు అవసరమని నాస్కామ్ పేర్కొంటున్నది. కానీ ఆ నైపుణ్యం ఉన్న వారు ఎక్కువగా లేరు. రోబోటిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగి మనకు కావాల్సి ఉంటే మెయిన్‌ఫ్రేమ్‌లో నైపుణ్యం ఉన్న ఉద్యోగిని తీసుకున్నామనుకోండి.. దానివల్ల స్కిల్ గ్యాప్ ఏర్పడుతుంది. రాబోయే కాలంలో ఇదే అతిపెద్ద సవాలుగా నిలువబోతున్నది అని గుర్నానీ పేర్కొన్నారు.




