Wednesday, 4 November 2026

ఇంటిని జాకీలు పెట్టి ఎత్తేశారు

బుద్వేలులో అరుదైన ప్రయోగం

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి):రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లోని వర్మ కాలనీకి చెందిన వీవీకేటీ శర్మ తన ఇంటి ఎత్తును పెంచేశారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా ఇంటిని జాకీలు పెటట్‌ఇ పైకి లేపారు.

ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అతని ఇంట్లోకి వరదనీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ఇంటిముందు రెండుమూడు సార్లు రోడ్డు వేయడంతో రోడ్డు ఎత్తయ్యింది.. ఇళ్లు లోతట్టుగా మారింది. దీంతో వర్షం పడిన ప్రతిసారి శర్మ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తోంది. సమస్య నుంచి బయటపడాలంటే ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించాల్సిందే. అలాగైతే సుమారు రూ.12లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన శర్మకు ఇంటిని పైకెత్తే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిసింది. దాని గురించి ఆరా తీసి.. హరియానా నుంచి బిల్డింగ్‌ లిప్టింగ్‌ కంపెనీ వారిని పిలిపించి రెండు వారాల క్రితం ఇంటిని పైకెత్తే పనులు ప్రారంభించారు. ఇంటి చుట్టూ జాకీలు బిగించి ఇంటిని 4 అడుగులు పైకెత్తారు. పనులు ముగింపు దశకు వచ్చాయని కంపెనీ ప్రతినిధి అరుణ్‌సిసోడియా తెలిపారు. ఇందుకు రూ.3.5-4 లక్షల వరకు ఖర్చవుతుందని యజమాని శర్మ తెలిపారు.