Tuesday, 3 November 2026

ఇసుక విధానంలో పారదర్శకత

వెబ్‌ సైట్‌ ప్రారంభించిన మంత్రి హరీష్‌
హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలంగాణలో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. పారదర్శకంగా ఇసుకును చేరవేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక వ్యాపారం మాఫియాలో సాగిందని చెప్పారు. అయితే ఇప్పటికే తక్కువ ధరకే ఇసుకను అందించే విధంగా కొత్త పాలసీని ప్రకటించినట్టు ఆయన అన్నారు.ఇకపై ఆన్‌లైనే ఇసుక బుక్‌ చేసుకోనే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. తమ ఆదాయం కోల్పోతున్నామనే కొంతమంది రాజకీయ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి  అన్నారు. ఈ సందర్భంగా  మంత్రి హరీష్‌రావు ఇసుక వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు. తెలంగాణలో అత్యంత పారదర్శకంగా ఇసుకను విక్రయిస్తామని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలో ఇసుకను విక్రయించేందుకు కొత్త ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను ఆరికట్టి సామాన్యులకు ఇసుకను అందించడమే తమ ఉద్దేశమన్నారు. ఇదిలావుంటే ఇసుక మాఫియా ఆరోపణలతో  సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలంపూర్‌లో ఇసుక టెండర్ల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించడంలో టీఆర్‌ఎస్‌ నేతలు దాదాగిరి ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అలంపూర్‌లో సోమవారం  నిర్వహించిన ఇసుక టెండర్లను పూర్తిగా రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలుస్తామని, టెండర్లు వేసేవారికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *