డ్రిప్ ఇరిగేషన్
– రాష్ట్ర వ్యాప్తంగా 39కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం
– ప్రతి జిల్లా అటవీ ప్రాంతంలో 6లక్షల పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలి
– వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌లకు సూచించిన సీఎస్ ఎస్.కె. జోషి
హైదరాబాద్, జులై9(జనం సాక్షి) : పొలాల్లో ఈత మెక్కలు నాటే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం సీఎస్ ఎస్‌కె జోషి తెలిపారు. తెలంగాణకు హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ ఎస్‌కే జోషి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత హరితహారం జులై రెండో వారంలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని సీఎస్‌అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. హరితహారం నిర్వహణకు ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ ఏడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని..ఆయా జిల్లాల్లో క్షణమే మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఈ సారి హరితహారంలో పాఠశాల పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులనే ప్రతీ ఇంటి హరితహారం వారధిగా గుర్తించాలని సీఎస్ సూచించారు. ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈత మొక్కలు నాటే రైతులకు ఉద్యానశాఖ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కోతుల బెడత నివారణకు హరితహారంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ జిల్లా అటవీ ప్రాంతాల్లో 5 నుంచి 6 లక్షల పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఈ నెల 25, 28 తేదీల్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పార్కుల పనులు జులై 15 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ పక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.




