సర్పంచ్ల ఎన్నికతో మారనున్న తండాల తీరు
హైదరాబాద్,మే22(జనం సాక్షి): తెలంగాణలో ఈ సారి పంచాయితీ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకో బోతున్నాయి. పంచాయితీలుగా మరిన తండాలు స్వపరిపాల దిశగా అడుగులు వేయనున్నాయి. ఇంతకాలం హామ్లెట్ గ్రామాలుగా ఉన్న తండాలన్నీ ఇప్పుడు పంచాయితీలుగా తమ సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఎన్నుకోబోతున్నాయి. గ్రావిూణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తండాలను, గూడాలను పంచాయతీలుగా మారుస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హావిూని అమలు చేసి చూపించారు. కనీస సౌకర్యాలకు నోచుకోని మారుమూల గిరిజన గ్రామాలకు కొత్త పంచాయతీల ఏర్పాటు వల్ల ఊహించని రీతిలో అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమయ్యే విధంగా, గ్రామాల ముంగిట్లో స్థానిక పరిపాలన అందుబాటులోకి రానుంది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు వార్డులను కూడా విభజించడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తయారై ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేందుకు కొత్త పంచాయతీల విధానం దోహదపడనుంది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినా ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ సమయంలో నోటిఫికేషన్ జారీ చేసినా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితాలతో పాటు వార్డు రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ ఓటర్ల గణన, పోలింగ్ కేంద్రాలను గుర్తింపు, ఇతర కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ కలెక్టరేట్‌కు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలను పంపిస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ఇప్పటికే ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధమైంది.
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులతో తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటించి అన్ని పంచాయతీల్లో కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రకటించారు. జిల్లాల్లోని పంచాయతీ అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి అన్ని మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఏడు సెట్ల చొప్పున ఓటర్ల జాబితాలను పంపిణీ చేసేందుకు జాబితాలను సిద్ధం చేశారు. రాజకీయ పార్టీలకు కూడా ఈ జాబితాలను అందించనున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన పనులతో కార్యాలయం బిజీబిజీగా మారింది. రాషట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి బీసీ ఓటర్లను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించే పక్రియ పూర్తయ్యింది. జనాభా, ఓటర్ల నిష్పత్తి ప్రకారం బీసీలకు కూడా వార్డుల రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉన్నందున బీసీ ఓటర్లను గుర్తించి గణాంకాలను రూపొందిస్తున్నారు. నాలుగు రోజులుగా బీసీ ఓటర్ల గుర్తింపు పక్రియ ముమ్మరంగా జరుగుతోంది. బీసీ ఓటర్లను గుర్తించిన తరువాత ఆయా పంచాయతీల వారీగా బీసీలకు ఎన్ని వార్డులను రిజర్వేషన్ చేయాలో నిర్ధారిస్తారు.
—————————




