Tuesday, 3 November 2026

ఉచితంగా కోడెల పంపిణీ ఆసక్తిగల రైతులు సంప్రదించండి

జులై . (జనంసాక్షి) గ్రామాల్లో రైతులు కోడెలు పోషించుకునే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా కోడెలను అందిస్తామని గో పరిరక్షణ  సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఝరాసంగం లోని కేతకి సంగమేశ్వర ఆలయం ఆధ్వర్యంలోని కోడెలను రాష్ట్ర గోరక్షణ సమితికి అందిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి వివరించారు. ఈ మేరకు గురువారం ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం లో గో రక్షణ సమితి బృందం సభ్యులు, ఆలయ ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గోసేవ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్  మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు కోడెల తో సేంద్రియ ఎరువు తయారు చేసి, పంటలను సాగు చేసే వారికి కోడెలను ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.  రైతులు సేంద్రియ ఎరువులు తయారు చేసి మిర్చి పసుపు తదితర పంటలను సాగు చేస్తున్నట్లు, సాగుచేసిన పంటలను కూడా మార్కెట్ ధరకు తామే స్వయంగా కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. తమ ద్వారా తీసుకున్న కోడెలను అమ్మితే శాఖాపరంగా కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులు గోశాలను, స్థానిక సర్పంచ్ లను సంప్రదించాలన్నారు. ముందుగా ఝరాసంగం మండలం లోని గ్రామాల రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి 2 నుండి 3 నెలలకోసారి తమ బృందం సభ్యులు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు, జిరాక్స్ లతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీశ్వర్, తెరాస అధ్యక్షుడు రాచయ్య స్వామి, మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్, మాజీ బోర్డు సభ్యులు నాగేశ్వర్ సజ్జన్, నాగన్న పాటిల్ ,శివురాజ్, వైద్యాధికారి సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.