పనులను సవిూక్షించిన మంత్రులు
హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): సికింద్రాబాద్ లోని సుప్రసిద్ధ క్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆషాఢ మాస బోనాల జాతరకు ముస్తాబవుతోంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో బోనాల జాతర జరుగనుంది.సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని చెప్పారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రులు సవిూక్ష జరిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, డీసీపీ సుమతి, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. బోనాల జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తామని మంత్రి పద్మారావు అన్నారు. సమస్యలేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని? వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండగను ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరుపుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈసారి అమ్మవారికి బంగారు బిందెతో బోనం సమర్పిస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కారు బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిందని మంత్రి తలసాని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదన్నారు. అటు, బోనాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బొంతు రామ్మోహన్ తెలిపారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు జంటనగరాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోంది. భక్తులకు అమ్మవారి దర్శనం సులువుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.




