Thursday, 5 November 2026

ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవాలి

– సీఐ రామలింగారెడ్డి
హుజూర్ నగర్, మార్చి 10 (జనంసాక్షి): ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవాలని హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో జరిగిన వీడ్కోలు వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి విషయాలకు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఉండాలని కోరారు. ఇతరులను హింసించి తాను సంతోషించే ర్యాగింగ్ లాంటి భూతాలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్సై కట్టా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ప్రియదర్శిని విద్యాసంస్థల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడితే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నారు. విజయం సాధించడం వలన మంచి జీవితం పొందవచ్చునన్నారు. అనంతరం విద్యాసంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లు సిహెచ్ బాల సైదులు, మట్టపల్లి రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.