హైదరాబాద్,మే12(జనం సాక్షి ): అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలితో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు సెమినార్స్ నిర్వహిస్తారని, కాలేజీల ఎంపిక, స్కాలర్ షిప్పులు, ఉద్యోగ అవకాశల వంటి వివరాలు అందిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా వచ్చే విద్యార్థులకు వివరాలు అందించేందుకు ప్రత్యేక గైడ్స్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థుల్లో 30 శాతం మనవాళ్లు ఉండేవారని, ఇటీవల ఆ సంఖ్య తగ్గిందన్నారు.




