Thursday, 5 November 2026

మూడోరోజూ సాఫీగా చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ

పలు జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు
ఎండలను లెక్క చేయకుండా సాగిన కార్యక్రమం
హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): ఎండలను లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.  మూడోరోజూ  శనివారం కూడా ఎక్కడా నిర్విఘ్నంగా కార్యక్రమం కొనసాగింది. అనేక జిల్లాల్లో మంత్రులు ముందుండి చెక్కులను పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు.
రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో జరిగిన  కార్యాక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రుల పోచారం, తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లు  లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వాలు  రైతులను పట్టింకోలేదని  మంత్రి పోచారం అన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో రైతులకు ఎకరానికి 4 వేల రుపాయలు ఇచ్చి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నరన్నారు. అటూ రైతుల జీవితాల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు రైతుబంధు పథకంతో  వెలుగులు నింపుతోందన్నారు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ.  సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రైతులు రాజులుగా వెలుగుతున్నారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం దేశానికే దశదిశ చూపిస్తుందని మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నరు. రెండు పంటలకు పెట్టుబడి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నరు. రైతు బంధు పథకంతో రైతులందరికీ సీఎం కేసీఆర్‌  బంధువు అయ్యారని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు
మండలంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాలను మంత్రి హరీష్‌ రావు పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికే సీఎం కేసీఆర్‌  మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి హరీష్‌ రావు అన్నరు. రైతుల కోసం ఎన్నో పథకాలు తెస్తుంటే..కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డరు. రైతు బంధు పథకం కులమతాలకు అతీతమైనదని స్పష్టం చేశారు. ప్రతీ రైతుకు రైతుబంధు చెక్కులను అందిస్తామన్నరు హరీష్‌ రావు. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ లో రైతులకు పాస్‌ బుక్కులు, చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రైతులు రాజులుగా వెలుగుతున్నారని మంత్రి జోగు రామన్న తెలిపారు. 60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రైతులు సీఎం కేసీఆర్‌ ఔదార్యంతో స్వర్ణయుగం అనుభవిస్తున్నారన్నారు.  ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనాథ్‌ మండలంలోని పలు గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున రైతులు పాల్గొని చెక్కులతో పాటు పాస్‌ పుస్తకాలు అందుకున్నారు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతు బంధు పథకం జోరుగా అమలవుతోంది. కొల్లపూర్‌ నియోజకవర్గ పరిధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృతంగా పర్యటిస్తూ అన్నదాతలకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారు. కొల్లపూర్‌ టౌన్‌లో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో వందలాది రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్‌ బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి తన భూమికి వచ్చిన 45 వేల రూపాయల పంట సాయాన్ని తిరిగి రైతు సంక్షేమ నిధికే అందజేశారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా శావిూర్‌పేట మండలంలోని కోల్తూర్‌ గ్రామంలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటు ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి పథకం కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిన పరిస్ధితి వస్తుందని తలసాని అన్నారు. ఈ సందర్భంగా కోల్తూర్‌లో మంత్రి తలసాని కుటుంబ సభ్యులకు ఉన్న పొలాలకు వచ్చిన చెక్కును రైతు సమన్వయ సమితికి విరాళంగా ఇచ్చారు.
—————