ఎడమ కాలువ గండిని తక్షణమే పూడ్చి పంటలను కాపాడాలి

– సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్

 

మునగాల, సెప్టెంబరు 17(జనంసాక్షి): సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని తక్షణమే పూడ్చి సాగునీరు అందించి, పంటలను కాపాడాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
కోదాడలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, వారం రోజుల్లో గండి పూడుస్తామని చెప్పిన జిల్లా మంత్రి ఆవైపే తిరిగి చూడక పోవడం బాధాకరమని చెప్పారు. గండి పుడ్చివేత పనులను సకాలంలో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నెస్పీ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.
ఎండలు బాగా ఉండటంతో నీరు లేక వరి పొలాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ద ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించక పోతే రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు.