బిజెపి నేతల్లో ఇదే తక్షణ ప్రణాళిక
20 సీట్లపై గురిపెట్టిన కమలనాథులు
హైదరాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషించాలని బిజెపి చూస్తోంది. ఇప్పుడున్న ఐదు సీట్లకు కనీసగా మరో ఐదు కలిసినా పదిసీట్లతో చక్రం తిప్పవచ్చని బిజెపి నేతల వ్యూహంగా ఉంది. టిఆర్‌ఎస్ తక్కువ సీట్లు గెలుస్తుందని, తాము ఓ పది సీట్లయినా గెల్చుకుంటే చక్రం తిప్పొచ్చనన్నది కమల నాతుల వ్యూహంగా ఉంది. అందుకే అతిరథ మహారథులంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచార ప్రకటనలు కూడా పెంచారు. వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ లాంటి వారు కూడా ప్రచారంలో దిగారు.
తామే విజయం సాధించాలని ప్రధాన పక్షాలైన టీఆర్‌ఎస్, ప్రజా కూటమి ¬రా¬రీగా పోరాడుతున్న తరుణంలో బిజెపి కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తోంది. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు త్రిముఖ పోటీ ఉందని బిజెపి నేతలు చెబుతున్నారు. ఉభయ పక్షాల్లో ఎవరికీ అధికారం దక్కదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని బీజేపీ ఆశిస్తున్నది. కనసీంగా పది నుంచి 15 సీట్లు గెలిస్తే తెలంగాణలో చక్రం తిప్పేది తామేనని భావిస్తున్న బీజేపీ అందుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో బలమైన శక్తిగా ఆవిర్భవించేందుకు వ్యూహం రచిస్తోంది. ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్‌తో పాటు నగరంలో మరిన్ని సీట్లు సంపాదించాలని బిజెపి భావిస్తోంది. అలాగే గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న సీట్లపైన బిజెపి గురిపెట్టింది. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి ఆచారి కేవలం 78 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో తొమ్మిది మంది ప్రధాన పార్టీలను తోసిరాజని రెండో స్థానంలో నిలిచారు. ఈసారి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న దృష్టితో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో బీజేపీ అగ్ర నేతలంతా ఇక్కడ ప్రచారం చేపట్టారు. అలాగే కరీంనగర్/-లోనూ గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇలాంటి నియోజకవర్గల్లో ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటికే ఒకసారి పర్యటించిన మోదీ మరోసారి కూడా ప్రచారానికి రావడంలో మతలబు కూడా ఇదే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, జె.పి.నడ్డా, పార్టీ అగ్ర నేతలు రామ్ మాధవ్, మురళీధర్‌రావు తదితరులు పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 23 సీట్లలో తాము బలంగా ఉన్నామని బీజేపీ భావిస్తోంది. ఈసారి టీడీపీ తమకు మిత్రపక్షంగా లేకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఆశిస్తోంది. పలు సీట్లలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. తమ ఓటు బ్యాంకు, గతంలో ఓడిపోయిన
సానుభూతి, వ్యక్తిగత ఇమేజి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన, ఓడిన వారితోపాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు తిరుగుబాటు అభ్యర్థుల్ని చేర్చుకుని వారికి కూడా బీజేపీ టిక్కెట్లిచ్చింది. ఆయా సీట్లలో గట్టిగా ప్రచారం చేస్తోంది. 118 సీట్లలో అభ్యర్థులను నిలిపినా కనీసం ఓ 20 సీట్లలో గట్టి పోటీ ఇస్తోంది.




