మున్సిపల్ ఛైర్‌పర్సన్ అవిశ్వాసంపై కాకరేపిన రాజకీయం
బెల్లంపల్లి,జూలై5(జనం సాక్షి): మున్సిపల్ చైర్మన్ల అవిశ్వాస తీర్మానాలు టీఆర్‌ఎస్‌లో కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన మెజార్టీ కౌన్సిలర్లను బయటకు రప్పించేందుకు ఎమ్మెల్యేలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బెల్లంపల్లి కౌన్సిలర్‌ను బెదిరిస్తూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన ఫోన్‌కాల్ బయటపడడమే గాకుండా కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం అధికార టీఆర్‌ఎస్‌లో దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌కు చెందిన చైర్‌పర్సన్ సునీతారాణికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఇండిపెండెంట్ తదితర మెజార్టీ కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. 34మంది కౌన్సిలర్లకు గాను 29మంది పది రోజులుగా రహస్య క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అవిశ్వాస నోటీసు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నయ్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మంత్రులు, ఇతర ముఖ్యనేతలు బుజ్జగించినా అసమ్మతి కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ నోటీసు ఇచ్చి తీరుతామంటున్నారు. అయితే ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ కూతురి పట్ల ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. ‘విూ అమ్మ క్యాంపు నుంచి రాకపోతే విూ భూవివాదాన్ని బయటకు తీస్తా’ అంటూ బెదిరించారు. ప్రభుత్వంలో ఉన్నామని, క్యాంపులో ఉన్నవారు బయటకు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఎమ్మెల్యే చిన్నయ్య టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కుమార్తెను హెచ్చరించారు. వీరి సంభాషణలకు సంబంధించిన ఆడియోబయటపడటంతో సోషల్ విూడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కొత్తగా ఛైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న స్వరూప వర్గాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుత ఛైర్ పర్సన్ సునీత రాణిపై కౌన్సిలర్ స్వరూప అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. 34 మంది కౌన్సిలర్లలో తనకు 29 మంది సభ్యుల మద్దతుందని ఆమె చెబుతున్నారు. ప్రస్తుత ఛైర్ పర్సనే మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్వరూప భర్త రమేశ్‌పై కేసు నమోదు కావడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఎమ్మెల్యే కేసులు వేయిస్తున్నారని స్వరూప ఆరోపిస్తున్నారు. స్వరూప వర్గంలోని కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసేలా ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేపులు విడుదల కావడం కలకలం రేపుతోంది.




