Tuesday, 3 November 2026

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోమారు పొడిగింపు

ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల క్లీయరెన్స్‌ 
హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును మే 31కి పొడగిస్తూ ప్రభుత్వం మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనుమతులకు నోచుకుని దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలు నిర్వహించి దరఖాస్తుదారులకు ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. ‘ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 80వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 26వేల దరఖాస్తులు ఇంకా సరైన దస్త్రాలు సమర్పించని జాబితాలో ఉన్నాయి. వాటిలో యూఎల్‌సీ, భూ వినియోగ బదిలీ పత్రం, రుసుం చెల్లించాల్సి ఉండటం వంటి విభాగాల్లోని దరఖాస్తుల పరిశీలనకే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల మధ్య అటు, ఇటు మారిన దరఖాస్తులనూ పరిశీలిస్తాం. ఆమేరకు ఆయా దరఖాస్తుదారులు జోనల్‌ కార్యాలయాల్లోని సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇతరత్రా పత్రాలు సమర్పించాల్సిన జాబితాలోని దరఖాస్తులన్నిటినీ తిరస్కరణకు గురైనట్లే భావించాలని పట్టణ ప్రణాళిక విభాగం వివరించింది.