నంబర్‌వన్ సంస్థ కావడంతో ధీమా
జీవితంలో తాను చేసిన గొప్ప పని అన్న కెసిఆర్
కౌలు రైతులకు సాయం అందించలేమని స్పష్టీకరణ
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిచడం కుదరదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అమల్లో కొన్ని సమస్యలున్నాయని.. అందువల్లే భూమి యజమానికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు, ఎల్ఐసీ ప్రతినిధులు హాజరయ్యారు.రైతుకు జీవిత బీమా కోసం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకోవడం తాను జీవితంలో చేసిన గొప్ప పని అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతుబీమా పథకానికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన, దేశంలోనే నెంబర్ వన్ సంస్థ ఎల్ఐసితో ఒప్పంద కారణంగా బీమాకు ఢోకా ఉండదన్నారు. రైతుబంధు, రైతుబీమాపథకాల అమలుపై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతుందని సీఎం చెప్పారు. రైతుబీమా పథకానికి ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు.ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ రైతుబీమా వర్తిస్తుందన్నారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి బీమా సాయం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా రూ. 5 వేల కోట్లు రైతులకు అందాయని తెలిపారుదేశానికి అన్నం పెట్టే రైతుకు సమస్యలు ఉండకూడదు అనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. అందరికీ అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తాను తెలంగాణ రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి మనం చేరుకోవాలని సూచించారు. రైతులు అందరూ సంఘటితమవ్వాలి. సంఘటితమవడంలో ఉన్న శక్తి రైతులకు తెలియాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైతులు మంచి రైతులుగా.. తెలివైన రైతులుగా మారాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.మనం తెలివిగా వ్యవసాయం చేయాలి. పంటల సాగుపై రైతులకు ఏఈవోలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పండించిన ప్రతి పంటకు మంచి రాబడి వచ్చేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. పంటల కాలనీలను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు ఉన్నాయో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఎకరంలో.. ఏ గుంతలో ఏ పంట ఉందో మనకు తెలియాలి. ఫలితంగా రాష్ట్రంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందో మనకు తెలుస్తుందని సీఎం పేర్కొన్నారు.
———–




