హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): ప్రధాని మోదీ హయాంలో దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని సీపీఐ నేత రామకృష్ణ దుయ్యబట్టారు. అయితే దానిని కప్పిపుచ్చుకోఎవడానికి అవినీతి రహిత పాలన అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో ప్రచారం చేయించుకుంటున్నారని, ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ నిర్వహిస్తామని తెలిపారు. పెట్రోల్‌పై ఒక్క పైసా తగ్గించి క్రూరంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మరోవైపు ఎపిలో నవ నిర్మాణ దీక్షలంటూ ప్రజల సొమ్ముని వృథా చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో బాబు ప్రచారాం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. ఇదిలావుంటే బ్లాక్‌మనీ వెలికి తీయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ రైతుల నడ్డి విరగొట్టారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని, జాతిని కాపాడదాం అనే నినాదంతో… సెప్టెంబర్, అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా పర్యటిస్తామని వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ ధరల పెంపుపై జూన్ 29న దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని చాడ చెప్పారు.




